తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం | తెలంగాణ ఈపాస్
Scholarships

తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం | తెలంగాణ ఈపాస్

తెలంగాణ ప్రభుత్వం కాలేజీ విద్యార్థులకు అందించే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌ను తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పేరుతొ అందిస్తుంది. ఈ పథకం కింద ఇంటర్‌మీడియట్, ఐటిఐ అ ఇంజనీరింగ్, మెడిసిన్, పిహెచ్‌డి చదువుతున్న విద్యార్థుల ట్యూషన్ ఫీజు మరియు మెస్ చార్జీలను విద్యార్థి చదువుతున్న కాలేజీలకు చెల్లిస్తుంది.

విద్యార్థి కుటుంబ కనీస ఆదాయం 2 లక్షల లోపు ఉండి, 75% హాజరు ఉండే విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు ఏటా సెప్టెంబర్ మరియు మార్చి నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తారు. రెసిడెన్సియల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలవారీగా జమచేస్తారు.

స్కాలర్షిప్ పేరు తెలంగాణ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్
స్కాలర్షిప్ టైప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ & మెస్ మెయింటెనెన్స్ చార్జీలు
స్కాలర్షిప్ వర్తింపు ఇంటర్మీడియట్ నుండి పీజీ
 స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ 75% కనీస హాజరు & 2.5 లక్షలలోపు కుటుంబ ఆదాయం

తెలంగాణ  ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్ విలువ విద్యార్థి ఎంపిక చేసుకున్న కోర్సుపైన ఆధారపడి ఉంటుంది. దాదాపు అన్ని కోర్సులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల ప్రకారం పూర్తి మొత్తంలో ట్యూషన్ ఫీజు చెల్లిస్తారు. సెల్ఫ్ ఫైనాన్సడ్ కోర్సులకు మాత్రం కాలేజీల ఫీజులను అనుచరించి గరిష్టంగా ఏడాదికి ఇరవై వేలు అందిస్తారు. అలానే మెస్ చార్జీలను నెలవారిగా వివిధ కోర్సులకు ఈ క్రింది విధంగా అందజేస్తారు.

తెలంగాణ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ట్యూషన్ ఫీజు (RTF) మరియు మెయింటెనెన్స్ ఛార్జీలు లేదా మెస్ ఛార్జీలు (MTF) ను నాలుగు గ్రూపుల వారీగా అందిస్తుంది. గ్రూప్ I లో ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు ఉండగా, గ్రూప్ II లో పీజీ, పీహెచ్డీ, పాలిటెక్నిక్ వంటి కోర్సులను ఉంచింది.

గ్రూప్ III యందు జనరల్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను, చివరిగా గ్రూప్ IV యందు ఇంటర్, ఐటిఐ, ఒకేషనల్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ వంటి కోర్సులను ఉంచింది. ఒక్కో గ్రూపు యందు ఉండే కోర్సులకు చెల్లించే ఆర్‌టిఎప్, ఎంటీఎప్ చార్జీల పరిధి ఒకే మాదిరిగా ఉంటుంది.

కోర్సు వారీగా తెలంగాణ  ఫీజు రీయింబర్స్‌మెంట్ & మెస్ చార్జీలు

ట్యూషన్ ఫీజు (RTF) హాస్టల్ మెస్ ఛార్జీలు (MTF) మెయింటెనెన్స్ ఛార్జీలు (డే స్కాలర్)
గ్రూప్ I 23,000/- to 6,90,000/- 1500/- 650/-
గ్రూప్ II 3,610/- to 92,000/- 1500/- 650/-
గ్రూప్ III 1,500/- to 20,000/- 1000/- 500/-
గ్రూప్ IV 850/- to 16,400/- 750/- 500/-

మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని, గత పదిహేనేళ్లుగా వివిధ పేర్లతో అమలు చేస్తుంది. ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల తెలంగాణకు చెందిన ఎందరో నిరుపేద విద్యార్థులు, ఉన్నత చదువులు చదువుకుని, నేడు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

ఇలాంటి పథకం దేశంలో ఇదే మొట్టమొదటిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు ఈ పథకాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు దీని పరిధిని పెంచుకుంటూ పోయాయి.

తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ

తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రెండు లక్షలలోపు కుటుంబ దాయం ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కేటగిర్లకు చెందిన విద్యార్థులకు అందజేస్తున్నారు. విద్యార్థి హాజరు 75% కి తక్కువ ఉండకూడదు. విద్యార్థులు స్టేట్ బోర్డు లేదా రాష్ట్ర యూనివర్సిటీల పరిధిలో అడ్మిషన్ పొందిఉండాలి.

విద్యార్థి కుటుంబానికి అన్ని రకాల భూములు కలిపి 25 ఎకరాలకు మించి ఉండకూడదు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగస్తుడు కానీ ఉద్యోగ పెన్షన్ తీసుకునే వారు కానీ ఉండకూడదు. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ఆదాయ పన్ను చెల్లించే వారు ఉండకూడదు.

ఈ పథకం డ్రీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందేవారికి వర్తించదు. అలానే మానేజ్మెంట్ లేదా స్పాట్ అడ్మిషన్ పద్దతిలో జాయిన్ అయ్యే విద్యార్థులకు వర్తించదు. అంతేకాక కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ అడ్మిషన్ పొందే విద్యార్థులు కూడా ఈ పథకం పరిధిలోకి రారు.

తెలంగాణ ఈపాస్ దరఖాస్తు విధానం

సంబంధిత కోర్సులలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు తెలంగాణ ఈపాస్ పోర్టల్ ద్వారా, సంబంధిత వెల్ఫేర్ డిపార్టుమెంట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ) ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా చేసుకున్న దరఖాస్తులను కాలేజీ ప్రిన్సిపాల్ ద్రువీకరించాల్సి ఉంటుంది.

ఆ తర్వాత దశలో వెరిగికేషన్ అధికారి, చివరిగా వెల్ఫేర్ అధికారి ఆమోదం పొందిన దరఖాస్తు దారులకు స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసినప్పటి నుండి స్కాలర్షిప్ మంజూరయ్యేంత వరకు దానికి సంబంధించిన స్టేటస్‌ను ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

తెలంగాణ ఈపాస్ రెన్యువల్

తెలంగాణ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌ను ఏటా విద్యార్థులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందటి వార్షిక పరీక్షలలో అర్హుత పొందినవారు స్కాలర్షిప్‌ను రెన్యువల్ చేసుకునేందుకు అర్హులు. ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల ద్వారా మార్కుల మెమోను పొంది తిరిగి అదే ఈపాస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది

Post Comment